Online Puja Services

నాయనార్ల గాథలు - ఇలైకుడి మారనార్ నాయనారు.

18.221.165.246

నాయనార్ల గాథలు - ఇలైకుడి మారనార్ నాయనారు. 
లక్ష్మీ రమణ 

ఈశ్వరుడు కుల-మతాలకు, వృత్తి-ప్రవృత్తులకు అందనివాడు. వాటికి అతీతమైన వాడు.  అందరికీ ఆధారమైన’ సత్తు’వ, , ‘చిత్త’ము ఆ  పరమేశ్వరుడు.  సచ్చిదానంద స్వరూపుడు.  వీరు,వారని ఎంచక అందరినీ అక్కున చేర్చుకొనే ఆనంద కారకుడు , ఆనంద స్వరూపుడు. అందుకే, బోయవాడైన ఆ తిన్నడు తల్లి ప్రేమతో తపించిపోయి, మాంసం నివేదిస్తే మహదానందంగా తిని, కన్నప్పగా అనుగ్రహించాడు.  కుమ్మరి పని చేసే తిరునీలకంఠ నాయనారు తప్పు చేసినా తన మీద పెట్టిన ఆన కోసం జీవితమంతా భక్తితో తపిస్తే , అతనికోసం తానే స్వయంగా దిగి వచ్చాడు.  కైవల్యాన్ని అనుగ్రహించాడు. ఆ శివలీలలు అనంతమైనవి. అనంత కారుణ్యాన్ని నింపుకున్నవి.  భక్తికి వశపడతానని ప్రతిసారీ రుజువు చేసిన భగవంతుని అభివ్యక్తులవి. ప్రతి ఆలయంలో ఇప్పటికీ నిలిచి ఆ శివుని భజిస్తున్న నాయనార్ల గాథలు కేవలం కథలు కాదు, జరిగిన యదార్థ సంఘటనలు . అటువంటి మరో దివ్యమైన జీవనగాథ పంటకాపైన మారనార్  కథ . 

రైతులు అన్నదాతలు .  విత్తు నాటిన నాటి నుండీ పంట చేతికి వచ్చే వరకూ ప్రతి ఒక్క దశలోనూ రైతు అమ్మ ప్రేమేని పంచితేనే ఆ విత్తు మొలకెత్తి ధాన్యలక్ష్మిగా మారి మన కడుపుని నింపుతుంది.  ఆ విధంగా ఇలైకుడి అనే గ్రామంలో రైతుల పంటకి కాపలాకాసే పని చేవాడు మారనార్. 

ఆయన నిరంతర మహేశ్వర పూజా వ్రత తత్పరుడు. అతిథి మహేశ్వరో భవ అనేదే ఆయన సిద్ధాంతం.  విభూతితో తిరుపుండ్రాలుపెట్టుకొని , రుద్రాక్షలు ధరించిన సత్పురుషులను , బాటసారులనూ కూడా సాక్షాత్తూ ఆ ఈశ్వరునిగా భావించి సేవించడమే మహేశ్వర పూజా విధానం .  అటువంటి అతిధులు ఎవరు తన కంట పడినా మారనార్ వదిలేవారు కాదు.  వారిని సాక్షాత్తూ శివునిగా భావించి, తన ఇంటికి సాదరంగా ఆహవించి వెంట తీసుకు వెళ్లేవారు.  కాళ్ళు కడిగి ఆ జలాన్ని తన శిరస్సున జల్లుకునేవారు . ఈశ్వరార్చనలో చేసినట్టే, ఆ అతిథికి ధూపదీపాదులు అర్పిచి చక్కగా భోజనం పెట్టి, వారు తిరిగి వెళ్లేప్పుడు ,  వారి కూడా కొంతదూరం వరకూ వెళ్ళి  సాగనంపి వచ్చేవారు .  

అతిధి సేవ చేసేవారింట, శివార్చనలు నిత్యమూ జరిగేచోట లక్ష్మీదేవి నిత్యమై కొలువై ఉంటుంది.  అందువల్ల మారనార్ కి సంపదకు లోటులేదు. కానీ ఆ సంపద తనకి చెందినది కాదని, అది ఆ ముక్కంటికి చెందినదని మారనార్ భావించేవాడు.  సంపదమీద వ్యామోహాన్ని, సంపద ఉన్నాడనే ఆడంబరాన్ని ఇసుమంతైనా ప్రదర్శించేవాడు కాదు .  

బంగారమైనా కొలిమిలో కలిస్తేనేకానీ శుద్ధమవ్వదు కదా ! అందుకే బంగారమని తెలిసినా ఆ పుత్తడికి పుటంపెట్టి మరనార్ భక్తి ప్రకాశాన్ని బయట ప్రపంచానికి తెలియజేయాలనుకున్నాడు ఆ  ఈశ్వరుడు . ఆయన సంకల్పం చేత మారనార్ సంపదలన్నీ, క్రమంగా కరిగిపోయాయి . తాను ఉన్న ఇంటిని కూడా తాకట్టులో కోల్పోయాడు . తినడాకి కూడా గింజలులేని దుర్భర దారిద్య్రంలో పడిపోయాడు. అయినా సరే, తన మహేశ్వర వ్రతాన్ని మాత్రమూ విడువలేదు . ఉన్నంతలో అధితులని సేవించుకుంటూ నిరంతరం ఆ ఈశ్వరనామాన్నే జపిస్తూ, భార్యాభర్తలిద్దరూ ఒక గుడిసెలో కాపురం ఉన్నారు . 

ఇదిలా జరుగుతుండగా, ఒకనాటి సమతుల వాతావరణ స్థితిలో, ఇంట్లో ఉన్న గుప్పెడు గింజలూ ఉదయమే నారు పోసి, ఇక తినడానికి కూడా గింజలులేక  మారనార్, అతని భార్య కూడా  పస్తుతో పడుకున్నారు. ఆనాటి రాత్రి ఉన్నట్టుండి వాతావరణం మారిపోయింది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు  కుంభవృష్టిగా వాన కురవసాగింది.అటువంటి సమయంలో  మారనార్ గుడిసె తలుపు తట్టాడు ఒక శివభక్తుడు .  మారనార్ అతన్ని సాదరంగా లోపలికి ఆహ్వానించి, తల తుడుచుకోవడానికి, కట్టుకోవడానికి పొడి వస్త్రాలనిచ్చి సర్వ ఉపచారాలూ చేశాడు.  కానీ, తామే పస్తులున్న పరిస్థితిలో, సాక్షాత్తూ ఈశ్వర స్వరూపంగా ఉన్న అతిథికి  ఆహారాన్ని సమకూర్చేదెలా ? పెద్ద చిక్కే వచ్చింది మారనార్ కి . మనసుంటే మార్గముంటుందని, మారనార్ భార్య చక్కని ఉపాయం చెప్పింది. ఎంతైనా, కార్యేషు మంత్రి కదా భార్యంటే ! 

ఆమె అన్నదీ “ స్వామీ! ఉదయం మీరు నారు కోసం పెరట్లో పోసిన విత్తనాలు ఉన్నాయి కదా ! వాటిని తీసుకురండి. ఈ లోగా నేను పెరట్లో ఉన్న ఆకులతో వ్యంజనాన్ని తయారు చేస్తానని” గొప్ప  ఉపాయాన్ని చెప్పింది. తమ రేపటి ఆకలి తీర్చడం కోసం నాటిన విత్తులు. పుడమి తల్లి గర్భాన్ని చేసి కొత్త ఊపిరి పోసుకొని , చిగురులు తొడిగేందుకు నాటిన బీజాలవి.  పంట పెట్టే వాడికి, ఆ బీజాలు తిరిగి పచనానికి తీయడంలో బాధ తెలుస్తుంది . ఒక తల్లి పడే గర్భశోకంతో సమానమది ! 

కానీ మారనార్ ఆలోచించలేదు.  ఈశ్వరార్చనే తనకి సంక్రమించే  ఆ భాధ కన్నా మిన్నని భావించాడు . భార్యమాటకి  సరేనని, పెరటిలోకి వెళ్ళాడు.  అప్పటికే  ఆ విత్తులన్నీ తవ్వే పని లేకుండా  వర్షానికి నీటిపైన తేలుతూ కనిపించాయి. మారనార్ వాటిని సేకరించి తీసుకువచ్చారు.  అతని భార్య వాటిని దంచి వడకట్టి , దాంతో తాను తీసుకొచ్చిన ఆకులని కలిపి  రుచికరమైన పదార్థాన్ని తయారు చేసింది. 

అప్పటి వరకూ అనుకోకుండా విచ్చేసిన ఆ అతిథి విశ్రాంతి తీసుకుంటున్నాడు.  భోజనానికి ఆహ్వానించేందుకు వెళ్ళాడు మారనార్. అప్పటివరకూ అక్కడే ఉన్న ఆ వ్యక్తి అకస్మాత్తుగా మాయమయ్యాడు.  ఆకాశంలో పరమేశ్వరుడు, అపరాజితా దేవితో కలిసి దర్శనమిచ్చాడు.  

“ మారనార్ ! నీ మహేశ్వర పూజకి సంతోషించానయ్యా ! నీకడుపు మాడ్చుకొని, రేపటి నీ ఆకలిని కూడా విడిచి,  పుడమి తల్లికిచ్చిన బీజాలు కూడా అతిధిసేవకిచ్చిన నీ సేవానిరతి నన్ను ముగ్దుణ్ణి చేసింది.  మీ దంపతులకి శాశ్వత కైలాస వాసాన్ని అనుగ్రహిస్తున్నాను” అని పలికాడు.  అంతే కాదు, “ఇకనుండి నువ్వు సేవచేసిన ఈ పుడమి (గ్రామం) పేరుతో కలిసి ఇలైకుడి మారనార్ నాయనారుగా నా భక్తునిగా శాశ్వత ఘనకీర్తిని ప్రసాదిస్తున్నా”నని అనుగ్రహించారు. 

ఆ విధంగా సంపద పట్ల మొహాన్ని విడిచి సర్వశ్య శరణాగతి చేసిన మారనార్  ఇలైకుడి మారనార్ నాయనారుగా శివభక్తుల్లో శాశ్వత స్థానాన్ని పొందారు.  

సర్వం శ్రీ గురు దక్షిణామూర్తి చరణారవిందార్పణమస్తు! శుభం ! 

 

Ilayankudi, Maranar, Nayanar, stories,

Quote of the day

The Vedanta recognizes no sin it only recognizes error. And the greatest error, says the Vedanta is to say that you are weak, that you are a sinner, a miserable creature, and that you have no power and you cannot do this and that.…

__________Swamy Vivekananda